సౌదీ, అమెరికాలను మించి.. భారత్‌కు కొత్తగా ఆయిల్ ఇస్తున్న దేశం ఇదే!

  • భారత్‌కు మూడో పెద్ద ఆయిల్ సరఫరాదారుగా వెనిజువెలా
  • రోజుకు 4.17 లక్షల బ్యారెళ్ల సరఫరా
  • చౌక ధరకే దొరుకుతుండటంతో భారత రిఫైనరీల మొగ్గు
  • రష్యా, యూఏఈ మాత్రమే వెనిజువెలా కంటే ముందున్నాయి
  • పశ్చిమాసియా యుద్ధం వల్ల మారిన ఆయిల్ సమీకరణాలు
భారతదేశానికి అత్యధికంగా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో తాజాగా వెనిజువెలా చేరింది. ఎప్పుడూ ముందుండే సౌదీ అరేబియా, అమెరికా వంటి పెద్ద దేశాలను వెనక్కి నెట్టి మే నెలలో భారత్‌కు అత్యధికంగా ఆయిల్ సరఫరా చేసిన మూడో పెద్ద దేశంగా అవతరించింది. ఆ దేశం నుంచి రోజుకు 4.17 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ భారత్‌కు సరఫరా అవుతోంది. రష్యా, యూఏఈ మాత్రమే వెనిజువెలా కంటే ముందున్నాయి.

వెనిజువెలా నుంచి ఎందుకు?
వెనిజువెలా నుంచి భారత్ ఆయిల్ కొనడానికి ప్రధాన కారణం తక్కువ ధర. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం వల్ల ముడి చమురు ధరలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో వెనిజువెలా మిగతా దేశాల కంటే తక్కువ ధరకే ఆయిల్ ఆఫర్ చేస్తోంది. అక్కడి నుంచి వచ్చే ఆయిల్‌లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌నగర్ వంటి అత్యాధునిక రిఫైనరీలు శుద్ధి చేయగలవు. అందుకే రిలయన్స్ సంస్థ దీన్ని భారీగా కొనుగోలు చేస్తోంది.

ఇరాన్, ఇరాక్ సరఫరాలు ఎందుకు తగ్గాయి?
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల హర్మూజ్‌ జలసంధి ద్వారా ఆయిల్ సరఫరా దెబ్బతింది. ఫిబ్రవరిలో ఇరాక్ నుంచి భారత్‌కు రోజుకు 9.69 లక్షల బ్యారెళ్ల ఆయిల్ వచ్చేది. మే నెలలో అది కేవలం 51 వేల బ్యారెళ్లకు పడిపోయింది. అటు అమెరికా నౌకాదళం ఇరాన్ పోర్టులను దిగ్బంధించడంతో ఇరాన్ నుంచి రావాల్సిన చమురు సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో భారత్ ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వచ్చింది.

వెనకబడ్డ సౌదీ అరేబియా
ఇంతకుముందు వరకు భారత్‌కు సరఫరా చేయడంలో టాప్‌లో ఉండే సౌదీ అరేబియా మార్కెట్‌ను కోల్పోయింది. ఆ దేశ ఆయిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో భారత కంపెనీలు వెనిజువెలా వైపు వెళ్లాయి. ఏప్రిల్‌లో సౌదీ నుంచి రోజుకు 6.70 లక్షల బ్యారెళ్లు వస్తే, మే నెలలో అది 3.40 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రూపాయి విలువ తగ్గడం వంటి సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో చౌకగా దొరికే వెనిజువెలా ఆయిల్ భారత ఆర్థిక వ్యవస్థకు కొంత ఊరటనిచ్చే అంశం.

Venezuela
India oil imports
crude oil
oil supply
Saudi Arabia
United States
Reliance Jamnagar
oil prices
Iran
Iraq

More Telugu News